రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ లీడ్ రోల్స్‌లో నితేష్ తివారీ తెరకెక్కించిన చిత్రం ‘రామాయణం’. యశ్‌తో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ నవంబర్ 5న రిలీజ్ కానుంది. నార్త్‌లో కరణ్ జోహార్, తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ ‘‘కొన్ని కథలు చెప్పాల్సిన అవసరం లేదు. అవి మనతో పాటు నిలిచిపోతాయి.
రామాయణం కూడా అలాంటిదే. ఓ గొప్ప తండ్రిగా, కొడుకుగా, భర్తగా, స్నేహితుడిగా ఎలా ఉండాలో మనందరికీ చెబుతుంది. ఇది మీకొక సినిమాలా కాకుండా ఏదో ఒక అద్భుతమైన అనుభూతిని పొందినట్టుగా ఉంటుంది. మనందరికి మంచిని పంచే సినిమా ఇది” అని చెప్పాడు. యశ్ మాట్లాడుతూ ‘‘భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే చిత్రమిది. ఇందులో భాగమవడం బ్లెస్సింగ్‌గా భావిస్తున్నా” అని చెప్పాడు. సాయి పల్లవి మాట్లాడుతూ ‘సీతమ్మ పాత్రలో నటించడం నాకు దక్కిన గొప్ప అదృష్టం.
ఇందులో చాలామంది గొప్ప స్టార్స్ ఉన్నారు. బెస్ట్ వీఎఫ్‌ఎక్స్ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచీ పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది’ అని చెప్పింది. ‘రామాయణ అంటే ఒక నిజం, ఒక చరిత్ర, ఒక ఎమోషన్. ఇలాంటి చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది’ అని రకుల్ చెప్పింది. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాతో ఇండియన్ హిస్టరీని ప్రపంచవ్యాప్తంగా చూపించబోతున్నారు. కచ్చితంగా వరల్డ్‌వైడ్‌గా వండర్స్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. ఇలాంటి ఓ ప్రతిష్టాత్మక సినిమాలో భాగమవడం సంతోషంగా ఉందని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ చెప్పారు.
దర్శకుడు నితీష్ తివారీ మాట్లాడుతూ ‘శివ, గీతాంజలి, క్షణక్షణం లాంటి చాలా సినిమాలు నేను తెలుగులో చూశా. ఇప్పుడు నేను తీసిన ‘రామాయణ’తో మీ ముందుకొస్తున్నా. మీరు తెలుగులో చూసినా, హిందీలో చూసినా నచ్చుతుందని నమ్ముతున్నా’ అని చెప్పాడు. నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ ‘మేం ఈ సినిమా తీసేటప్పుడు ఇదొక హిందీ సినిమా, తెలుగు సినిమా అని తీయలేదు.. దీన్నొక ఇండియన్ సినిమాగా, మన చరిత్రను ప్రపంచానికి చాటేలా తీశాం’ అని చెప్పాడు. రవి దూబె సహా టీమ్ పాల్గొన్నారు.
